శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (12:36 IST)

ఆ జిల్లాలో 131 రోజుల తర్వాత ఒక్క కరోనా మృతి కూడా నమోదు కాలేదు.. ఎక్కడ?

కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం అందరికీ ఊరట కలిగిస్తోంది. 
 
అదేసమయంలో కొవిడ్‌‌కు సంబంధించి మరో తీపి కబురు అందుతోంది. గతంలో రోజుకు అనేక కరోనా మరణాలు నమోదైన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఆదివారంనాడు ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఆ జిల్లాలో 348 రోజుల(దాదాపు సంవత్సర కాలం) తర్వాత కరోనా మరణాలు లేకపోవడం విశేషం. 
 
మూడు మాసాల క్రితం ఆ జిల్లాలో రోజూ 100కు పైగా కరోనా మరణాలు నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు జిల్లాలో కొవిడ్ మరణాలు సున్నాకు చేరడానికి హెర్డ్ ఇమ్యునిటీ ప్రభావమే దీనికి కారణమని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత వాతావరణం కూడా వైరల్ ఇన్ఫెక్షన్లకు అనుకూలంగా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
నాగ్‌పూర్ నగరంలో వరుసగా మూడో రోజు కరోనా మరణాలు సంభవించలేదు. ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు నాగ్‌పూర్ జిల్లాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ గత రెండు రోజుల్లో(శుక్ర, శనివారాలు) ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆదివారంనాడు ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఎవరూ కూడా నాగ్‌పూర్‌లో కొవిడ్ కారణంగా మరణించలేదు. 
 
2020 జులై 6 తర్వాత ఆ జిల్లాలో కొవిడ్ మరణం నమోదుకాకపోవడం ఇదే తొలిసారి. ఆ జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,76,761 కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 907గా ఉంది. చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 1000 కంటే దిగువునకు చేరాయి. ఆదివారంనాడు 8857 పరీక్షలు నిర్వహించగా 39 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. నాగ్‌పూర్ జిల్లాలో ఫిబ్రవరి మూడో వారంలో సెకండ్ వేవ్ ప్రారంభంకాగా… ఏప్రిల్ 19న అత్యధికంగా 113 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.