శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (11:15 IST)

అమిత్ షాకు రైతుల అల్టిమేటం... చేస్తారా? చేయరా? ఏదో ఒకటి చెప్పండి!

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రైతులు అల్టిమేటం జారీచేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారా? చేయరా? ఏదో ఒకటి తేల్చి చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని, అదొక్కటే తమ డిమాండని, అందుకు సానుకూలంగా ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని మాత్రం తమకు చెబితే చాలని రైతు నేతలు అమిత్ షాతో రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. 
 
ఈ వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ గత 14 రోజులుగా రైతులు ఛలో ఢిల్లీ పేరుతో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనలో భాగంగా, మంగళవారం భారత్ బంద్ కూడా నిర్వహించగా, ఇది విజయవంతమైంది కూడా. 
 
ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మీడియాను అనుమతించ లేదు. మంగళవారం జరిగిన భారత్ బంద్ విజయవంతమైన నేపథ్యంలో అత్యున్నత స్థాయిలో రైతులతో చర్చించాలని సమావేశం కావాలని కేంద్రం నిర్ణయించి, ఈ భేటీని జరిపినా, ఫలితం మాత్రం రాకపోవడం గమనార్హం.
 
'ఈ సాయంత్రం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమిత్ షా సమావేశానికి రావాలని, వెళ్లినా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమీ చెప్పలేదు' అని రైతుల నేత రాకేశ్ తికైత్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తనతో పాటు చాలా మంది ఈ సమావేశానికి వచ్చారని, తాము మాత్రం చట్టాలను వెనక్కు తీసుకుంటారా? లేదా? అన్న ఒక్క ప్రశ్నను మాత్రమే అడిగామని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా లేదని ఆయన ఆరోపించారు.