ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టుకెక్కిన ఒమర్ అబ్దుల్లా పార్టీ
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లాకు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. కేంద్ర నిర్ణయం అక్రమమని నేషనల్ కాన్ఫరెన్స్ వాదిస్తోంది.
కాశ్మీర్ మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ను నేషనల్ కాన్ఫరెన్స్ పార్లమెంటు సభ్యులు అక్బర్ లోనే, హస్నైన్ మసూదీ దాఖలు చేశారు.
కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో మాజీ ముఖ్యమంత్రి మహెబూబా ముఫ్తీని కూడా అరెస్టు చేశారు. వందలాది మంది రాజకీయ నేతలను అరెస్టు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా బలగాలను మోహరించారు.
జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులపై కాశ్మీరీ న్యాయవాది షకీర్ షబీర్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.