శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (12:07 IST)

#HappyBirthdayPM : సర్దార్ సరోవర్ డ్యామ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

ఐదు దశాబ్దాల కల నేటికి సాకారమైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు గుజరాత్‌లో ప్రారంభమైంది. యూనైటెడ్ స్టేట్స్‌లో ఉన్న గ్రాండ్ కౌలీ డ్యామ్ మొదటిది. ప్రతిష్టాత్మక సర్దార్‌ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని

ఐదు దశాబ్దాల కల నేటికి సాకారమైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టు గుజరాత్‌లో ప్రారంభమైంది. యూనైటెడ్ స్టేట్స్‌లో ఉన్న గ్రాండ్ కౌలీ డ్యామ్ మొదటిది. ప్రతిష్టాత్మక సర్దార్‌ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక పూజ చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ నర్మదా నదికి హారతి పట్టారు.
 
అనంతరం డ్యామ్‌ను పరిశీలిస్తూ కలియదిరిగారు. అక్కడి నుంచే ప్రజలకు అభివాదం చేశారు. డ్యామ్‌ను రంగుల రంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
కాగా, ఐదు దశాబ్దాల క్రితం మాజీ దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రు 5 ఏప్రిల్, 1961న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగిన తర్వాత అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. డ్యామ్‌ను వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ నడిపిన నర్మదా బచావో ఆందోళన్‌ ఇందులో అత్యంత కీలకమైనది. 
 
పర్యావరణ, పునరావాస సంబంధిత అంశాలపై ఎన్‌బీఏ అభ్యంతరాలు లేవనెత్తింది. కార్యకర్తలు సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్‌ పొందడంతో 1996లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. అనంతరం 2000 అక్టోబర్‌లో మిగిలిన పనులు చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. ఫలితంగా నేటికి ఐదు దశాబ్దాల కల సాకారమైంది.
 
సర్దార్ సరోవర్ డ్యామ్ పొడవు 1.2 కిలోమీటర్లు. జలాశయం లోతు 163 మీటర్లు. దాదాపు 30 గేట్లు ఉన్న సరోవర్ డ్యాంలో ఒక్కో గేటు బరువు 450 టన్నులు. ఒక గేటు ముయాలంటే గంట సమయం పడుతుంది. 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం.
 
ఈ విద్యుత్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ల పంపిణీ జరుగుతుంది. మహారాష్ట్రకు 57 శాతం, మధ్యప్రదేశ్‌కు 27 శాతం, గుజరాత్‌కు 16 శాతం చొప్పున విద్యుత్ పంపిణీ జరగనుంది. ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల రైతులకు ప్రయోజనం కలగనుంది. దాదాపు 4 కోట్ల మందికి తాగునీరు అందనుంది.
 
సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ద్వారా నర్మద నదీ జలాలను గుజరాత్‌లో తీవ్ర నీటిఎద్దడి ఉన్న ప్రాంతాలకు కాలువలు, పైపులైన్లతో పంపిస్తారు. 18వేల 144 గ్రామాలకు తాగునీరందిస్తారు. దాదాపు 18 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయి. 
 
రాజస్థాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మెర్‌, జలోర్‌లు సహా మొత్తం 2.46 లక్షల హెక్టార్లకు సాగునీరందనుంది. మహారాష్ట్రలో 37వేల 500 హెక్టార్లకు నీరందుతుంది. ఇక్కడ 9వేల 633 గ్రామాలు, 131 పట్టణ ప్రాంతాలకు తాగునీటిని ప్రత్యేకంగా కేటాయించారు.