శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (14:32 IST)

చిన్నారి ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు : ముంబై హైకోర్టు

చిన్నారి ప్యాంటు జిప్ తీయడం, ఆమె చేయి పట్టుకోవడం లైంగికదాడి కిందకు రాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐపీసీ 354 సెక్షన్ కింద విధించిన శిక్షాకాలాన్ని కోర్టు తగ్గించింది. 
 
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, మైన‌ర్ బాలిక చేయి ప‌ట్టుకోవ‌డం, ఓ ఐదేళ్ల బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన 50 ఏళ్ల వ్య‌క్తికి ట్రయ‌ల్ కోర్టు పోక్సో చ‌ట్టం సెక్ష‌న్ 10 కింద ఐదేళ్ల క‌ఠిన కారాగార శిక్ష‌, రూ.25 వేల జ‌రిమానా విధించింది. 
 
అంటే.. ఆ చిన్నారి ప్యాంటు జిప్ తీయడం, చేయి పట్టుకోవడం వంటివి ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్రం సెక్సువ‌ల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) కింద లైంగిక దాడి కాద‌ని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ చెప్పింది. అది ఐపీసీ సెక్ష‌న్ 354 కింద లైంగిక వేధింపుల కిందికి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. 
 
దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయ‌గా.. అది పోక్సో చ‌ట్టం కింద లైంగిక దాడి కాద‌ని జ‌స్టిస్ పుష్ప గ‌నేడివాలా స్ప‌ష్టం చేశారు. ఆ చ‌ట్టం కింద విధించిన శిక్ష‌ను ర‌ద్దు చేశారు. గ‌రిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్ర‌మే విధించ‌గ‌లిగే ఐపీసీ సెక్షన్ 354 కింద నిందితుడిపై అభియోగాలు మోపారు. 
 
అయితే అప్ప‌టికే అత‌డు ఐదు నెల‌ల జైలు శిక్ష అనుభ‌వించి ఉండ‌టంతో.. ఈ నేరానికి ఆ శిక్ష స‌రిపోతుంద‌ని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 19న కూడా ఇదే న్యాయ‌మూర్తి.. నేరుగా శ‌రీరాన్ని స్పృశించ‌కుండా (స్కిన్ టు స్కిన్ టచ్) ఓ మైన‌ర్ బాలిక స్థ‌నాల‌ను తాక‌డం పోక్సో చ‌ట్టం కింద లైంగిక దాడి కాద‌ని తీర్పు వెలువ‌రించిన విష‌యం తెలిసిందే.