వినాయక చవితి రోజు నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రారంభ సమావేశాలు మాత్రం అంటే 18వ తేదీన జరిగే సమావేశంలో పాత భవనంలో ప్రారంభించి, ఆ తర్వాత రోజు నుంచి కొత్త భవనంలో నిర్వహించనున్నారు.
మరోవైపు, ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను బహిర్గతం చేయాలంటూ విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పెదవి విప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది.
'సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నారు" అని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
మన దేశంలో పార్లమెంటు "ప్రత్యేక సమావేశాలు" చాలా అరుదుగా జరుగుతుంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తిచేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తున్న "అమృత్ కాలం"లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్లు ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యానించారు.