పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలి : సోనియా డిమాండ్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలని కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆమె ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో బహిర్గతం చేయాలని కోరారు. అలాగే, ఈ ప్రత్యేక సమావేశాల అజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె పేర్కొన్నారు.
ప్రధానంగా పారిశ్రామికవేత్త అదానీ అక్రమాలు, ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కొనసాగుతున్న హింస, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కుల జన గణన, కేంద్ర రాష్ట్రాల మధ్య నానాటికీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చొరబాటుల, సైనికుల కాల్పులు తదితర అంశాలపై చర్చ చేపట్టాలని ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు.