సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 డిశెంబరు 2020 (09:44 IST)

కరోనాపై ప్రధాని కీలక భేటీ : వ్యాక్సిన్ సరఫరాకు ఫైజర్ సిద్ధం

కరోనా వ్యాక్సిన్ తదితర అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. పర్చ్యువల్ విధానంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఇందులో దేశంలో కరోనా వ్యాక్సిన్ లభ్యత, ఆపై దాని పంపిణీ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వ్యాక్సిన్ నెట్‌వర్క్ ఏర్పాటుపై ప్రధాని తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుండగా, లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల నేతలనూ సమావేశానికి రావాలని పిలిచారు.
 
ఈ భేటీలో ప్రధాని మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌లు కూడా హాజరువుతారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ఉంటారని అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతానికి దేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన కరోనా సమస్యపైనే కేంద్రం దృష్టిని సారించనుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే గత నెల 24న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ, 28వ తేదీన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న కంపెనీలను కూడా సందర్శించి వచ్చారన్న సంగతి తెలిసిందే. ఆపై 30న వ్యాక్సిన్ తయారీ సంస్థలైన జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలతోనూ మాట్లాడారు.
 
ఇదిలావుంటే, దేశంలో ఐదు వ్యాక్సిన్‌లను పరిశీలిస్తున్నారు. వీటి ట్రయల్స్ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు ఇస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలోని 92 శాతం జాబితా, ప్రైవేటు ఆసుపత్రులలోని 52 శాతం మంది వైద్య సిబ్బంది జాబితా తమకు చేరిందని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
మరోవైపు, భారతదేశానికి కరోనా టీకా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ఫార్మారంగ దిగ్గజ సంస్థ ఫైజర్ ప్రకటించింది. జర్మనీకి చెందిన బయాన్‌టెక్‌తో కలిసి కొవిడ్ టీకాను ఫైజర్ అభివృద్ధి చేసింది. ఈ టీకా వినియోగానికి యూకేలో ఇప్పటికే తాత్కాలిక అనుమతి లభించింది. దీంతో వచ్చే వారం నుంచే అక్కడి ప్రజలకు ఈ టీకా అందుబాటులోకి రానుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టీకాను సరఫరా చేయాలని భావిస్తున్న ఫైజర్.. పలు దేశాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తామని, ఆ దేశానికి కూడా టీకాను అందించాలనుకుంటున్నామని ఫైజర్ చైర్మన్ అల్బర్టా బౌర్లా వెల్లడించారు. ఇది నిజంగా భారతీయులందరికీ శుభవార్త అని చెప్పొచ్చు.