1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (15:12 IST)

అమ్మకానికి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం - ఓఎల్ఎక్స్‌లో ప్రకటన

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ కార్యాలయాన్ని కొందరు వ్యక్తులు అమ్మకానికి పెట్టారు. ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ ఓఎల్ఎక్స్‌లో విక్రయించనున్నట్టు ఓ ప్రకటన వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వారణాసిలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఓఎల్ఎక్స్‌లో ప్రకటన వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు పేర్కొనడంతో పోలీసులు అవాక్కయ్యారు. 
 
వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని అమ్ముతున్నట్లు  క్లాసిఫైడ్స్ వెబ్‌సైట్ ఓఎల్ఎక్స్‌లో ప్రచురితమైన ప్రకటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. 
 
మోడీ కార్యాలయం వివరాలు, ఫొటోలను ప్రచురిస్తూ, దీనిని రూ.7.5 కోట్లకు అమ్ముతామని ప్రకటనదారులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రకటనను వెంటనే తొలగించి, ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. 
 
వారణాసిలోని మోడీ కార్యాలయం ఓ విల్లాలో ఉంది. ఓఎల్ఎక్స్‌లో ఇచ్చిన ప్రకటనలో, 6,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాగల ఈ  విల్లాలో 4 గదులు, 4 బాత్రూములు ఉన్నట్లు పేర్కొన్నారు. 
 
ఈశాన్య ముఖ ద్వారం ఉన్న ఈ ఇంట్లో రెండు అంతస్థులు ఉన్నాయని, కార్ పార్కింగ్ కూడా ఉందని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే ఈ ప్రకటనను తొలగింపజేశారు. దీనికి బాధ్యులైన నలుగుర్ని గుర్తించి, అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.  
 
వారణాసి ఎస్ఎస్‌పీ అమిత్ కుమార్ పాఠక్ తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మీకాంత్ ఓఝా అనే వ్యక్తి ఈ ప్రకటనను ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగుర్ని అరెస్టు చేశారు. ఈ ప్రకటన కోసం ఈ విల్లాను ఫొటో తీసిన వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.