గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2022 (17:19 IST)

రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం

indian railway
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్‌(పీఎల్‌బీ)ని ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్‌ను ఇస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. ఇందుకోసం రూ.1832.09 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది. 
 
అలాగే, పీఎల్‌బీ చెల్లింపులకు గాను నెలకు రూ.7 వేల చొప్పున లెక్కించి అర్హులైన 11.27లక్షల మంది ఉద్యోగులకు బోనస్‌గా ఇవ్వనున్నారు. దీంతో ఉద్యోగులకు గరిష్టంగా రూ.17,951 చొప్పున బోనస్‌గా వచ్చే అవకాశం ఉంది.
 
ప్రయాణికులు, వస్తు రవాణా సేవలందించడంలో రైల్వే ఉద్యోగులు కీలక పాత్ర పోషించి ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేశారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రశంసించారు. లాక్డౌన్‌ సమయంలోనూ ఆహారం, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర వస్తువులను నిరంతరాయంగా తరలించేందుకు సహకరించారని ఆయన గుర్తుచేశారు. 
 
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసున్నారు. అలాగే, ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. గత రెండేళ్లలో (2020 జూన్‌ నుంచి 2022 జూన్‌ వరకు) వంటగ్యాస్‌ విక్రయాల్లో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఆయా సంస్థలకు పరిహారం ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ సంస్థలకు వన్‌టైం గ్రాంటు కింద రూ.22 వేల కోట్లు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గత రెండేళ్ల కాలంలో అంతర్జాతీయంగా వంటగ్యాస్‌ ధరలు దాదాపు 300 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ మూడు సంస్థలు వినియోగదారులకు వంటగ్యాస్‌ సరఫరా చేసినట్టు తెలిపింది.