సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

ayodhya city
అటు ఉత్తరప్రదేశ్, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణంలోని లోపాలు ఒకే ఒక్క భారీ వర్షం బాహ్య ప్రపంచానికి చూపించింది. రూ.311 కోట్లతో 14 కిలోమీటర్ల మేరకు నిర్మించిన రామథ్ (అయోధ్య రహదారి) కుంగిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అయోధ్య అతలాకుతలమైపోతుంది. కొద్దిపాటి వర్షానికే రామాలయం గర్భగుడిలోకి నీళ్లు రాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అయోధ్య దాదాపు నీట మునిగినంత పనైంది. వీధులు కాలువలను తలపించాయి. రామాలయానికి వెళ్లేందుకు భక్తులు నానా తంటాలు పడుతున్నారు. మోకాలి లోతు నీరు, బురదలో అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. 
 
తాజాగా, రూ.311 కోట్ల వ్యయంతో నిర్మించిన 'రామథ్' కుంగిపోయింది. రామమందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల రోడ్డు ఆలయ గేటుకు అర కిలోమీటరు దూరంలో మీటరు వ్యాసార్థంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో రెండు గోతులు ఏర్పడ్డాయి. అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహరీ కుప్పకూలింది. రోడ్లు కుంగిపోయి, వీధులు అస్తవ్యస్తంగా మారడంతో రంగంలోకి దిగిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీనిపై యోగి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరుగురు మున్సిపల్ అధికారును సస్పెండ్ చేసింది.