మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:28 IST)

చెన్నైలో చైన్ స్నాచర్లు.. ఎనిమిది నెలల గర్భిణీ మెడలోని చైన్‌ను వదల్లేదు..

చెన్నైలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. చెన్నైలోని పల్లావరంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ మహిళను రోడ్డుపైకి నెట్టి ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ లాక్కెళుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపించింది. చైన్ చేతికి చిక్కిన వెంటనే బైక్‌పై ఆ దొంగలు పారిపోయారు. ఈ ఘటనలో రోడ్డు మీదకు ఆ చైన్ స్నాచర్ ఈడ్చుకొచ్చిన బాధితురాలు ఎనిమిది నెలల గర్భిణి కావడం స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. పల్లావరంలోని రేణుకానగర్‌లో గీత (25) అనే వివాహిత శుక్రవారం ఉదయం తన ఇంటికి సమీపంలోని చిన్న ఆలయం దగ్గర.. రోడ్డు పక్కన నిల్చుని దణ్ణం పెట్టుకుంటోంది. ఆమె నిల్చున్న పక్కనే ఓ కిరాణా దుకాణం ఉంది. ఆమె గుడి ముందు నిల్చుని ఉండగా.. ఆమెకు కొద్దిదూరంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆగారు. ఆ ఇద్దరిలో ఒకరు బైక్ దిగి గీతను సమీపించాడు. 
 
ఆమె దేవుడిని ప్రార్థిస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. గీత ప్రతిఘటించడంతో ఆమెను రోడ్డు పైకి నెట్టేశాడు. బలవంతంగా ఆమె మెడలోని గోల్డ్ చైన్‌ను లాక్కుని బైక్‌పై పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే గీత, ఆమె భర్త రామచంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.