సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (12:50 IST)

జర్నలిస్టును అర్ధనగ్నంగా చెడ్డీతో నిలబెట్టిన సీఐ సస్పెండ్

journalist
journalist
మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టుకు చేదు అనుభవం ఎదురైంది. జర్నలిస్టును స్టేషన్‌‍లో అర్ధనగ్నంగా నిలబెట్టారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో కాస్త వైరల్ కావడంతో సీఐని భోపాల్ ఏఎస్పీ వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. 
 
మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ స్టేషన్‌ యూట్యూబ్‌ జర్నలిస్ట్‌తో సహా కొంతమందిని స్టేషన్‌లోకి తీసుకెళ్లి వారిని చెడ్డీలపై నిలబెట్టడం అనేక విమర్శలకు తావిస్తోంది. నిరసనకారులతోపాటు జర్నలిస్టును, కెమెరా మెన్‌ను బట్టలు తీయించి ఇలా అండర్ వేర్‌తో నిలబెట్టడంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అధికార బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు గురు దత్‌ శుక్లా.. అనురాగ్‌ మిశ్రా అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో తనను బేదిరిస్తున్నాడని సిద్ధి కొత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు విచారణలో భాగంగా నీరజ్‌ కుందర్‌ అనే థియేటర్‌ ఆర్టిస్టును అరెస్టు చేశారు. 
 
అయితే అతని అరెస్టుకు వ్యతిరేకంగా ఇంద్రావతీ నాట్య సమితికి చెందిన పలువురు సభ్యులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న కనిష్క్‌ తివారీ అనే యూట్యూబ్‌ జర్నలిస్టు తన కెమెరా మెన్‌తో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. నిరసనకారుల వద్ద సమాచారం సేకరిస్తున్నాడు.
 
దీంతో ఆగ్రహానికి లోనైన స్టేషన్‌ ఆఫీసర్‌ మనోజ్‌ సోనీ అందరినీ అరెస్ట్‌ చేశాడు. అంతటితో ఆగకుండా నిరసనకారులతోపాటు జర్నలిస్టును, కెమెరా మెన్‌ను బట్టలు తీయించి చెడ్డీలపై స్టేషన్‌లో నిలబెట్టాడు.  
 
దీంతో జర్నలిస్టు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో భోపాల్‌ ఏఎస్పీ ఆ సీఐని విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.
 
అనుమతి లేకుండా నిరసన వ్యక్తం చేసి శాంతికి విఘాతం కలిగించినందుకు వారిని అదుపులోకి తీసుకుని ఏప్రిల్ 3న విడుదల చేసినట్లు పోలీసు అధికారి సోని తెలిపారు. కానీ గురువారం నిరసనకారులు తమ లోదుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
 
జర్నలిస్ట్ కనిష్క్ తివారీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ ఒక ప్రకటనలో ఖండించారు. ఒక జర్నలిస్టుతో పోలీసులు ఇలా ప్రవర్తించడం మీడియా సౌభ్రాతృత్వం పట్ల బీజేపీ ప్రభుత్వ వైఖరిని, దాని ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని ఫైర్ అయ్యారు.