శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (10:41 IST)

కరోనా వ్యాక్సిన్ రవాణాకు సిద్ధంగా పూణె ఎయిర్‌పోర్టు : ఇంకా ఖరారు కాని టీకా ధర!

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లు దేశ వ్యాప్తంగా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా, ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కొవిషీల్డ్‌ ఇపుడు భారీ మొత్తంలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ టీకా ధరను మాత్రం కేంద్రం ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఈ టీకా సరఫరా ఇంకా మొదలుకాలేదు. 
 
వాస్తవానికి ఈ టీకాను పూణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఈ తయారు చేసి టీకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు చేరవేయాల్సివుంది. ఎందుకంటే.. ఈ నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా టీకాల పంపిణీ మొదలుకానుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ రవాణాను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సివుంది.
 
అయితే, మరో మూడు నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభంకానుండగా, ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం అనంతరం, కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి వ్యాక్సిన్‌ను రవాణా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
'ప్రస్తుతానికి కేంద్రం నుంచిగానీ, సీరమ్ నుంచిగానీ తమకు వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించాలని ఆదేశాలు రాలేదని చెబుతూనే, తొలి దశలో 70 నుంచి 80 శాతం టీకా వయల్స్‌ను విమానాల్లోనే ద్వారానే పంపనున్నాం. కొద్ది మొత్తం రోడ్డు రవాణా ద్వారానూ జరుగుతుంది" అని ముంబై కేంద్రంగా పనిచేస్తూ, వ్యాక్సిన్ రవాణా కాంట్రాక్టును పొందిన కూల్ ఎక్స్‌కోల్డ్ చెయిన్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ అగర్వాల్ వెల్లడించారు.
 
ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీని మొదలు పెట్టాలని కేంద్రం ఆలోచనలో ఉండగా, ఇంతవరకూ ధరపై ఓ నిర్ణయానికి రాలేదన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ను సకాలంలో అన్ని ప్రాంతాలకూ చేర్చాలంటే, కనీసం రేపైనా సరఫరా ప్రారంభించాల్సి వుంటుందని ఈ సందర్భంగా అగర్వాల్ అభిప్రాయపడ్డారు.ఇదిలావుండగా, గత వారం చివరలో ఎయిర్ లైన్స్ కంపెనీల ప్రతినిధులు సీరమ్ వర్గాలతో సమావేశమై, రవాణాపై చర్చించారు. అతి శీతల పరిస్థితులను విమానాల్లో ఉంచేలా చూస్తూ, రవాణా విమానాలను పుణె నుంచి న్యూఢిల్లీ, కోల్ కతా, చెన్నై తదితర ప్రాంతాలకు చేర్చడంపై ఉన్న సవాళ్లను చర్చించారు. ఆపై మేజర్ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాల నుంచి మారుమూల జిల్లాల్లో ఏర్పాట్లు చేసిన మినీ వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలకు, ఆపై అన్ని ఆరోగ్య కేంద్రాలకు చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే.
 
అయితే, కేంద్ర ప్రభుత్వంతో ఇంకా డీల్ కుదరనందునే వ్యాక్సిన్ సరఫరా ఆలస్యం అవుతోందని నిన్న సీరమ్ సీఈఓ అదార్ పూనావాలా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.