చైనాలోకి అడుగుపెట్టిన కరోనా స్ట్రెయిన్ : దేశ ప్రజలందరికీ ఉచిత టీకాలు!
బ్రిటన్‌లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ క్రమంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే భారత్, బ్రిటన్‌తో సహా 11 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఇపుడు తాజాగా చైనాలో అడుగుపెట్టింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళలో ఈ కొత్త స్ట్రెయిన్ కనిపించినట్టు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది.
గత నెల 14న షాంఘైకి వచ్చిన 23 ఏళ్ల యువతికి ఈ వైరస్ సోకినట్టు చైనా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె నుంచి డిసెంబరు 24న నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించారు.
ఈ వైద్య పరీక్షల్లో ఆమెకు బ్రిటన్ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి వచ్చిన తర్వాత ఆమె వుహాన్, షాంఘైలలో తిరిగినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆమె ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.
మరోవైపు, యూకే వైరస్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలు సాగించే విమానాలను నిషేధించాయి. 50కిపైగా దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. గత నెల 24 నుంచి చైనా కూడా బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిషేధించింది.
ఇదిలావుంటే, దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కరోనా టీకా సాధారణ వినియోగానికి చైనా అనుమతి ఇచ్చింది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులు కూడా విధించింది. సినోఫార్మ్ అభివృద్ధి చేసిన ఈ టీకా 79.34 శాతం సమర్థత కనబరచగా, 99.52 శాతం యాంటీబాడీ-పాజిటివ్ కన్వర్షన్ రేటును సాధించింది.
తాజాగా, ఈ టీకాకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచితంగా వేయనున్నట్టు తెలిపింది. సినోఫార్మ్ అభివృద్ధి చేసిన టీకా ఇచ్చిన చోట నొప్పి, చర్మం ఎర్రగా మారడం, జ్వరం, కండరాల నొప్పుల వంటి సమస్యలే తప్ప తీవ్రమైన దుష్ప్రభావాలేమీ లేవని అధికారులు తెలిపారు. ఈ టీకాకు మొత్తం 10 దేశాల్లో మూడో దశ ప్రయోగాలు నిర్వహించగా 70 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారు.
దేశం నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టాలంటే మొత్తం 70 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుందని, ఇందుకోసం 140 కోట్ల డోసులు అవసరమని అధికారులు తెలిపారు. అయితే, ఏడాదికి గరిష్టంగా 70 కోట్ల టీకాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్న వేళ స్వల్పకాలంలో ఇంతమందికి టీకా వేయడం సవాలేనని పేర్కొన్నారు.