ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (15:36 IST)

రాహుల్ వద్ద ఐదో రోజు కొనసాగుతున్న ఈడీ విచారణ

rahul gandhi
నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వద్ద ఐదో రోజు విచారణ కొనసాగుతోంది. గత వారంలో మూడు రోజుల పాటు విచారణ జరిగింది. మూడు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి మళ్లీ ఈ విచారణ చేపట్టారు. అలాగే, మంగళవారం కూడా రాహుల్‌ను విచారణకు పిలిచిన ఈడీ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. 
 
ఐదో రోజైన మంగళవారం ఉదయం 11.20 సమయంలో ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో విచారణ జరిగే కేంద్ర ఏజెన్సీ కార్యాలయం చుట్టూ పటిష్టపోలీసు, పారామిలిటరీ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో రాహుల్‌ను ఈడీ అధికారులు గత వారం మూడు రోజులపాటు విచారించిన విషయం తెలిసిందే. సో
 
మవారం నాలుగోసారి హాజరు కాగ.. విడతల వారీగా దాదాపు 12 గంటలకుపైగా సుదీర్ఘ విచారణ కొనసాగింది. మంగళవారం సైతం హాజరుకావాలని ఈడీ ఆదేశించగా.. ఆయన ఈ మేరకు చేరుకున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు రాహుల్‌ను ఇప్పటివరకు 40 గంటలకు పైగా ప్రశ్నించినట్లు సమాచారం.
 
రాహుల్‌ ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం సైతం నిరసనలు కొనసాగించాయి. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నందునే.. కేంద్రం ఆయన్ను విచారణ పేరిట వేధిస్తోందని నేతలు ఆరోపించారు.
 
ఇదిలావుంటే, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం జూన్‌ 23న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇటీవలే సోనియా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. కొవిడ్‌ సోకడంతో ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరిన ఆమె వారం రోజులకుపైగా చికిత్స తీసుకొని కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.