మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జూన్ 2022 (13:31 IST)

ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

karanam dharma sri
అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు. ఈయన గత 1998లో డీఎస్సీ పరీక్ష రాశారు. అప్పటి నుంచి ఈ ఫలితాలను వెల్లడించలేదు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 1998 బ్యాచ్ డీఎస్సీ అభ్యర్థులకు పోస్టులు టీచర్ పోస్టులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అనేక మంది అభ్యర్థులకు రిటైర్మెంట్ వయసు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయపోస్టులు వచ్చాయి. అలాంటి వారిలో కరణం ధర్మశ్రీ ఒకరు. 
 
తాను టీచర్‌గా ఎంపికకావడంతో ధర్మశ్రీ స్పందిస్తూ, డీఎస్సీ రాసినపుడు తన వయస్సు 30 యేళ్లు అని గుర్తు చేశారు. తమిళనాడులోని అన్నామలై యూనివర్శిటీలో బీఈడీ పూర్తి చేసినట్టు చెప్పారు. ఉపాధ్యాయుడుగా స్థిరపడాలని భావించానని, కానీ, 1998 డీఎస్సీ వివాదాల్లో చిక్కుకోవడంతో బీఎల్ పూర్తి చేసినట్టు చెప్పారు. 
 
ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి జిల్లా యువజన విభాగంలో పని చేసినట్టు తెలిపారు. అపుడు కనుక తనకు ఉద్యోగం వచ్చివుంటే ఉపాధ్యాయుడుగా స్థిరపడివుండేవాడినని చెప్పారు. ఇప్పటికైనా 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.