రాజ్‌భవన్ నుంచి ప్రేమలేఖ అందింది.. గవర్నరుతో టీ తాగేందుకు వెళ్తున్నా : అశోక్ గెహ్లాట్
రాజస్థాన్ రాజ్ భవన్ నుంచి తనకు ప్రేమ లేఖ అందిందని, ఇపుడు గవర్నరుతో కలిసి టీ తాగేందుకు అక్కడకు వెళుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలంటూ ఆ రాష్ట్ర మంత్రివర్గం చేసిన విజ్ఞప్తిని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ముచ్చటగా మూడోసారి తిరస్కరించారు.
కాగా, ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపించారు. దీన్ని పరిశీలించిన గవర్నరు తిరస్కరించారు.
అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నదీ సరైన కారణం చెప్పేందుకు కేబినెట్ తిరస్కరించడం వల్లే ఈ ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నట్టు గవర్నర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పకుంటే 21 రోజుల నోటీసు కోరవచ్చని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు, తనకు మళ్లీ ప్రతిపాదనలు పంవచ్చని సూచించారు.
దీనిపై ముఖ్యమంత్రి గెహ్లాట్ స్పందిస్తూ, రాజ్‌భవన్ నుంచి తనకు 'ప్రేమలేఖ' అందిందని, ఇప్పుడు తాను గవర్నర్‌తో కలిసి టీ తాగేందుకు మాత్రమే వెళ్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.