బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (22:53 IST)

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట : ఎపుడెపుడు ఏమేం జరగనున్నాయి... పూర్తి వివరాలు ఇవిగో...

ram mandir
అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ మహాఘట్టం ఆవిష్కృతంకానుంది. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో అలంకరించబడి. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం సిద్ధంగా ఉంది. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతరు ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
తొలుత ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం 10 గంటలకు 'మంగళ ధ్వని'తో ప్రారంభమవుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50కి పైగా సంగీత ప్రముఖులతో ఈ సంగీత కార్యక్రమం రెండు గంటల పాటు సాగనుంది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులు ఉదయం 10:30 గంటలకు రామజన్మభూమి కాంప్లెక్స్లోకి ప్రవేశిస్తారు.
 
శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రం అందించిన ఆహ్వాన పత్రిక ద్వారానే.. అతిథులకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుంటుంది. కేవలం ఇన్విటేషన్ కార్డుతో అతిథులు ప్రవేశించలేరు. ఆహ్వాన పత్రికలోని క్యూఆర్ కోడ్‌‍తో మ్యాచ్ అయిన తర్వాతే.. ప్రవేశం అనుమతించబడుతుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభం అవుతుంది.
 
రామ్లల్లా ప్రతిష్ఠాపనకు కేవలం 84 సెకన్లు మాత్రమే శుభ సమయం ఉంటుంది. అది.. మధ్యాహ్నం 12:29 నిమిషాల 08 సెకన్ల నుండి 12:30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉంటుంది. మృగశిర లేదా మృగశీర్ష నక్షత్రంలో రామ్లల్లా స్థాపన జరుగుతోంది. ఈ ప్రతిష్ఠాపనను కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది వేద ఆచార్యులు నిర్వహిస్తారు. 
 
ఈ సమయంలో.. 150కి పైగా సంప్రదాయాలకు చెందిన సాధువులు, మత పెద్దలు, 50 మందికి పైగా గిరిజనులు, తీరప్రాంత వాసులు, ద్వీపవాసులు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
 
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో 'రామజ్యోతి' వెలిగించి.. దీపావళి తరహాలో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న 'రామ్ కీ పౌరి' వద్ద 5 లక్షల దీపాలు వెలిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో పాటు దుకాణాలు, సంస్థలు, ఇళ్లు, ఇతర పౌరాణిక ప్రదేశాల్లో రామజ్యోతిని వెలిగించనున్నారు. 
 
రామ్లల్లా, హనుమాన్ గరి, గుప్తర్ ఘాట్, సరయూ బీచ్, కనక్ భవన్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా 100 దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో దీపాలు వెలిగిస్తారు.
 
ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఆలయంలో మూడు రకాల హారతులు నిర్వహిస్తారు. రోజూ ఉదయం 6.30, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు మూడు హారతులు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ హారతి వేడుకకి పాస్ అవసరం. ఆ పాస్లను ఉచితంగానే జారీ చేస్తారు. ఇక ఆలయంలో దర్శనం ఉదయం 7 నుండి 11:30 వరకు.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ఉంటుంది.