శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (22:27 IST)

12 రాష్ట్రాల్లో రేషన్‌ పోర్టబిలిటీ.. ధర ఖరారు చేసిన కేంద్రం

జాతీయ రేషన్‌ పోర్టబిలిటీ కింద పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కిలో రూ.3కు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అదనపు సబ్సిడీతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే ధరను ఖరారు చేయడం గమనార్హం.

‘ఒకే దేశం- ఒకే కార్డు’ పేరుతో పేదలు దేశంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునేందుకు వీలుగా కేంద్రం జాతీయ రేషన్‌ పోర్టబిలిటీ విధానం తీసుకొచ్చింది. ముందుగా తెలంగాణ, ఏపీలో, తాజాగా జనవరి 1 నుంచి గుజరాత్‌, మహారాష్ట్ర, హరియాణా, గోవా, కర్ణాటక, జార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపురలో ప్రయోగాత్మకంగా రేషన్‌ పోర్టబిలిటీ సేవలు మొదలయ్యాయి.

అతి త్వరలో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని లబ్ధిదారుల డేటాను ఈ-పాస్‌ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు. దీంతో ఈ రాష్ట్రాల లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ సదుపాయం తెలంగాణ, ఏపీకే పరిమితమైంది.

ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు విధానంలో కిలో బియ్యం రూ.3కు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే తెలంగాణలో రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నారు. మిగిలిన 2 రూపాయల భారాన్ని రాష్ట్రం భరిస్తోంది. ఏపీలో కూడా ఇంతే. లబ్ధిదారులు ఇతర రాష్ట్రంలో రేషన్‌ తీసుకుంటే మాత్రం రాష్ట్ర సబ్సిడీ వర్తించదు. కేంద్రం నిర్ధారించిన ధర రూ.3కే తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ పథకంలో కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. తెలంగాణ స్ఫూర్తితో... ఇతర జిల్లాలకు వలస వెళ్లే నిరుపేదలు రేషన్‌ పొందలేక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘స్టేట్‌ రేషన్‌ పోర్టబిలిటీ’ని 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. దీని స్ఫూర్తితో కేంద్రం నేషనల్‌ పోర్టబిలిటీని అమలులోకి తీసుకురావడం విశేషం.