శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (08:11 IST)

తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు

హైదరాబాద్ – తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల మద్యం ధరలు పది శాతానికి పైగా పెరిగినట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది.

పాత మద్యం నిల్వలకు కొత్త ధరలు వర్తంచవని పేర్కొంది. క్వార్టర్ పై రూ.20, హాఫ్ పై రూ.40, ఫుల్ పై రూ.80, అదే విధంగా బీరు ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్టు ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటించారు. కాగా, మద్యం ధరల పెంపు నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.400 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది.

అయితే, భారీగా అమ్ముడుపోయే బ్రాండ్ల ధరలనే అధికంగా పెంచారు. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలపైనే ఎక్కువ భారం పడనుంది. విదేశీ మద్యం ధరల పెంపు మాత్రం సాధారణంగా ఉంది. న్యూఇయర్, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం మద్యం ధరలను పెంచినట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో పెరిగిన రేట్ల కంటే.. ఇక్కడ పెంచిన రేట్లు తక్కువేనని ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
ఏపీలో మద్యం అమ్మకాలు తగ్గుముఖం 
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 34.92 శాతం తగ్గాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో మద్యం పాలసీపై జరిగిన చర్చలో సీఎం జగన్‌ మాట్లాడారు. మూడు దశల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పానన్నారు. చంద్రబాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉన్నాయని, ఇప్పుడు 3,456 మద్యం షాపులు ఉన్నాయన్నారు. దాదాపు 25 శాతం షాపులు తగ్గాయన్నారు.

2018 సెప్టెంబర్‌లో 22.19 లక్షల బీర్‌ కేసుల అమ్మకం జరగగా, 2019 సెప్టెంబర్‌లో 16.46 లక్షల కేసుల అమ్మకం జరిగిందన్నారు. 34.84 శాతం బీర్‌ అమ్మకాలు తగ్గాయన్నారు. 43వేల బెల్ట్‌ షాపులను పూర్తిగా రద్దు చేశామన్నారు. గత ప్రభుత్వం దగ్గరుండి మద్యం అమ్మకాలను ప్రోత్సహించిందన్నారు.

నిజాలు ఇలా ఉంటే అచ్చెన్నాయుడు పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అచ్చెన్నాయుడిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తున్నానని సీఎం జగన్‌ పేర్కొన్నారు.