ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (14:28 IST)

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం: మోదీ

తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయనను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు, డీ అరవింద్‌, గరికపాటి మోహన్‌ రావు కలిసినపుడు ప్రధాని ఈ వ్యాఖ్య చేశారు.

రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారని సమాచారం. వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందాక ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆ బిల్లును ఉభయసభల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యతిరేకించింది.

ముస్లింలకు తాము అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు సభలో చేసిన ప్రసంగంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయమై దృష్టిసారించాలని ఎంపీలను ప్రధాని కోరారు.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వేర్వేరు కార్యాచరణ రూపొందించుకొని క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు.

రెండు రోజుల క్రితం ప్రధానిని కలిసిన నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవితో కూడా ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయండి.. తప్పకుండా గెలుస్తారని’ అన్న సంగతి తెలిసిందే.