శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (07:44 IST)

బీహార్ లో కరోనా మృతుల కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం

కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, పార్కులు మూసేస్తున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కరోనాపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

వైరస్ బారినపడిన వారి చికిత్స ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి చికిత్స సహాయత కోశ్ పథకం నుంచి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు నితీశ్ కుమార్. ఒకవేళ చికిత్స పొందుతూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. 
 
బీహార్‌ను ఆనుకుని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దు వెంట 49 ప్రత్యేక క్యాంపులు పెట్టి స్క్రీనింగ్ చేస్తున్నామని, కరోనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే క్వారంటైన్‌లో ఉంచుతున్నామని చెప్పారు నితీశ్ కుమార్.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని, ఆస్పత్రుల్లో అదనంగా ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కరోనాపై చర్చ ముగిసిన తర్వాత అసెంబ్లీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.