ప్రేమించలేదని రాళ్లతో కొట్టాడు.. కిరోసిన్ పోశాడు.. చివరికి..?
మహిళలపై అకృత్యాలు రోజుకీ పెరిగిపోతున్నాయి. కామాంధులు ఓవైపు, ప్రేమోన్మాదులు మరోవైపు రెచ్చిపోతున్నారు. తాజాగా తమిళనాడులో తనను ప్రేమించలేదని యువతిపై రాళ్లతో దాడి చేసి హతమార్చాడు.
ఈ ఘటన తమిళనాడు, సేలం, అత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సేలం జిల్లా గంగ వళ్లి సమీపంలోని కుడుమలై గ్రామానికి చెందిన మురుగేషన్(45) రైతు. కడంబూరులో లీజుకు పంట పొలాల్ని తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇతని చిన్న కుమార్తె రోజా(19) నర్సింగా పురంలోని కళాశాలలో బీఏ చదువుతోంది.
ఈ నేపథ్యంలో ఆత్తూరు తండయార్ పేటకు చెందిన స్వామిదురై(22) చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువు కుంటున్నాడు. కుడుమలైలోని బంధువు చిన్నదురై ఇంటికి ఇటీవల వచ్చాడు. ఆ సమయంలో రోజా అతడి కంట పడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమ పేరిట వేధించడం మొదలెట్టాడు.
తన సోదరి నందినికి ఈనెల 13న వివాహం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో స్వామిదురై వేధింపులు రోజాకు తలనొప్పిగా మారాయి. దీంతో వారం రోజు క్రితం అతడిని తీవ్రంగా మందలించింది. అయినా, అతడు వినలేదు. సోమవారం ఆమె చదువుకుంటున్న కళాశాల వద్దకు వెళ్లి తన ప్రేమను చెప్పడమే కాకుండా, అంగీకరించకుంటే హతమారుస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన రోజా ఈ విషయాన్ని సోదరి నందిని ద్వారా తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. పంచాయతీ పెట్టించిన మార్పు లేదు.
దీంతో స్వామిదురై ఉన్మాదిగా మారాడు. రోజా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి వీరంగం సృష్టించాడు. తన మిత్రులతో కలిసి రోజా, ఆమె సొదరి నందినిపై దాడి చేశాడు.
ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. వీరి నుంచి అక్కచెల్లెలు తప్పించుకుని పంట పొలంలోని నీటి తొట్టెలోకి దూకేశారు. రక్షించాలని కేకలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే, రోజాను వెంటాడి మరీ ఆ ప్రేమోన్మాది తన మిత్రుల సాయంతో రాళ్లతో కొట్టి పడేశాడు.
నందిని కేకలు విని స్థానికులు రావడంతో ప్రేమోన్మాది పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న రోజాను ఆస్పత్రికి తరలించగా ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.