ఫేస్బుక్ ప్రేమ.. సరిహద్దు దాటిన యువతి.. కానీ కటకటాలకు..?
ఫేస్‍బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ కోసం ఆ యువతి సరిహద్దులు కూడా దాటింది. కానీ కటకటాల పాలైంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్ (22) అనే యువతి ప్రియుడి కోసం సరిహద్దులు దాటింది. ఫేస్‌బుక్ ద్వారా కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది.
అతని కోసం సరిహద్దుల్లో రాయల్ బెంగాల్ పులుల నివాసమైన దట్టమైన సుందర్బన్ అడవుల గుండా ప్రయాణించి, గంటపాటు నదిలో ఈది భారత్‌లోకి ప్రవేశించింది. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో మూడు రోజుల క్రితం అభిషేక్‌ను పెళ్లాడింది కూడా.
అయితే, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిందనే నేరంపై పోలీసులు కృష్ణ మండల్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఆమెను తిరిగి బంగ్లాదేశ్ హై కమిషనర్‌కు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.
కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలుడు ఇలాగే తనకిష్టమైన చాక్లెట్ కోసం సరిహద్దుల్లో నదిని ఈది భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ బాలుడిని కూడా అధికారులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.