గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (15:06 IST)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్తాకోడళ్ల మధ్య "చీర - జీన్స్" గొడవ

bride
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్తా కోడలి మధ్య దుస్తులు ధరించే విషయంలో గొడవ జరిగింది. కోడలు తన లాగే జీన్స్ దుస్తులు ధరించాలని అత్త హుకుం జారీ చేసింది. కోడలు మాత్రం.. తాను చీర మాత్రమే కట్టుకుంటానని అత్తకు తేల్చి చెప్పింది. దీంతో ఈ అత్తాకోడళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌ వరకు చేరింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రోజూ జీన్స్ ధరించే అత్త.. తన ఇంటికి వచ్చిన కోడలు కూడా తనలాగే జీన్స్ దుస్తులు వేసుకోవాలని ఒత్తిడి తెస్తోంది. తనకు చీర కట్టుకోవడమే ఇష్టమని చెబుతున్నా.. తన మాటను అత్త వినట్లేదని కోడలు వాపోతోంది. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. 
 
హరిపర్వతికి చెందిన ఓ యువకుడికి.. ఎత్మాదుర్ పరిధిలో ఉంటున్న యువతితో ఏడాది క్రితం వివాహమైంది. అయితే.. తనలాగానే రోజూ జీన్స్ వేసుకోవాలని కోడలిపై అత్త ఒత్తిడి చేస్తోంది. దీంతో కోడలు ఆగ్రా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. 'నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. నాకు జీన్స్ వేసుకోవడం ఇష్టం లేదు. ఈ విషయం నా భర్తకు చెబితే తిరిగి నన్నే కొడుతున్నారు' అని కోడలు ఫిర్యాదు చేసింది. సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఏసీపీ సుకన్య శర్మ తెలిపారు.