శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:56 IST)

సత్‌ప్రవర్తనతో జైలు నుంచి విడుదలకానున్న జయలలిత స్నేహితురాలు?

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే మహిళా నేత శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె సత్‌ప్రవర్తన కారణంగా ఆమెను ఒక యేడాది ముందుగానే రిలీజ్ చేసేందుకు జైలు అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నిజానికి ఆమె వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే, సత్ప్రవర్తన కారణంగా మినహాయింపు పొందుతున్నారని ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ చెబుతున్నారు. అనేకంగా ఈనెలాఖరులో శశికళ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
ఈ ప్రచారం మేరకు శశికళ జైలు నుంచి విడుదలైతే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం ఖాయం. ముఖ్యంగా, అధికార అన్నాడీఎంకే పార్టీతో పాటు.. అటు ప్రభుత్వంలో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య అంతర్గత పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో శశికళ జైలు నుంచి బయటకు వస్తే రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని చెబుతున్నారు.