మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (16:28 IST)

తప్పుడు సర్టిఫికేట్ కేసులో ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీం ఊరట

తప్పుడు సర్టిఫికేట్ కేసులో మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గ ఎంపీ, సినీ నటి నవనీత్‌ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కుల ధ్రువీకరణపత్రం రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 
 
అదేసమయంలో ఈ కేసులోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
 
ఎస్సీ రిజర్వుడ్‌ స్థానమైన అమరావతి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి నవనీత్‌ కౌర్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. శివసేన అభ్యర్థి ఆనందరావు అడుల్స్‌పై విజయం సాధించారు. అయితే, ఆనందరావు నవనీత్‌ షెడ్యూల్‌ కులాలకు చెందిన వ్యక్తి కాదంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో నవనీత్‌ కౌర్‌ పార్లమెంట్‌ సభ్యత్వం ప్రమాదంలో పడింది. అలాగే, రూ.2 లక్షల జరిమానా విధించింది. అన్ని ధ్రువపత్రాలను ఆరువారాల్లోగా సమర్పించాలని ఎంపీని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రం రద్దు విషయంలో బొంబాయి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ నవనీత్‌ కౌర్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ నాలుగు వారాల సమయం ఇచ్చింది. దీంతో నవనీత్ కౌర్‌కు తాత్కాలిక ఊరట ఇచ్చింది.
 
నవనీత్ తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు. నవనీత్ 2014లో రాజకీయాల్లోకి రాగా.. ఆమె శివసేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయింది. 2019లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. ఇంతకు ముందు, శివసేన నాయకుడు జైలులో పెడతామని బెదిరించారని నవనీత్‌ కౌర్‌ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి సైతం లేఖ రాశారు.