1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మణిపూర్ అల్లర్ల వెనుక విదేశీ హస్తం : సీఎం బీరేన్ సింగ్

manipur violance
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో గత రెండు నెలలుగా రెండు తెగలకు చెందిన ప్రజల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల వెనుక విదేశీ హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఈ హింసాత్మక చర్యలు మొత్తం ముందస్తు ప్రణాళికతో పక్కాగా అమలు చేసి ఉంటారని ఆరోపించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, 'మయన్మార్‌తో మణిపూర్‌ సరిహద్దులు పంచుకొంటోంది. చైనా కూడా కేవలం 398 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ సరిహద్దులు పూర్తిగా తెరిచే ఉంటున్నాయి. పహారా కూడా తక్కువే. వాస్తవానికి భద్రతా దళాలు అక్కడ ఉన్నా.. అంత సువిశాల ప్రదేశాన్ని పర్యవేక్షించడం సాధ్యంకాదు. 
 
ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో ఏ విషయాన్నీ కొట్టిపారేయలేము.. అలాగని ఆమోదించలేము.. వీటిని చూస్తుంటే ముందస్తు ప్రణాళికలతో జరుగుతున్నట్లు అనిపిస్తోంది. వీటికి కారణం మాత్రం తెలియడంలేదు. ఇప్పటికే నా కుకీ సోదర సోదరీమణులతో ఫోన్‌లో మాట్లాడాను. జరిగిన దానికి క్షమించి.. వదిలేయాలని కోరాను' అని బీరేన్‌ సింగ్‌ వెల్లడించారు.
 
జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌‌లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్న విషయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ నిర్ణయాన్ని మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయడం లేదని బీరేన్‌ సింగ్ ట్విటర్‌ ద్వారా తెగేసి చెప్పారు.