సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (08:41 IST)

సీబీఐ చరిత్రలోనే తొలిసారి : రూ. కోటి తీసుకుంటూ పట్టుబడిన రైల్వే అధికారి

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్‌లో అతిపెద్ద అవినీతి తిమింగిలం పట్టుబడింది. ఓ కాంట్రాక్టు కోసం ఏకంగా కోటి రూపాయల నగదు తీసుకుంటూ సీబీఐకు పట్టుబడ్డాడు. సీబీఐ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. ఈ అవినీతి అధికారి పేరు మహేందర్ సింగ్ చౌహాన్. ఆయనను ఆదివారం సీబీఐ అరెస్టు చేసింది.
 
ఆయన కోటి రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌‌గా పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకుంది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్‌లో మరిన్ని ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లను ఇప్పించేందుకు గాను ఆయన ఈ లంచాన్ని తీసుకున్నట్టు సీబీఐ తెలిపింది. గతంలోనూ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అధికారులు పట్టుబడినప్పటికీ ఇది మాత్రం సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసని అధికారులు తెలిపారు. 
 
కాగా, మహేందర్ సింగ్ రైల్వేస్ ఇంజినీరింగ్ సర్వీస్‌ 1985 బ్యాచ్ అధికారి. ప్రస్తుతం ఆయన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్ హెడ్‌క్వార్టర్స్ అయిన గౌహతిలో మాలిగావ్‌లో పోస్టింగులో ఉన్నారు. ఈ కేసులో ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సీబీఐ ఆదివారం దేశ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ, అసోం, ఉత్తరాఖండ్ సహా దేశంలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.