గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (11:11 IST)

ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో అత్యాధునిక ఫీచర్లు...

భారతీయ రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు.. మొబైల్ యాప్‌లో అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ  ఫీచర్ల సాయంతో యూజర్లు మరింత సులువుగా రైల్వే టికెట్లను బుకింగ్‌ చేసుకోగలుగుతున్నారు. 
 
ఉదాహరణకు ఐఆర్‌సీటీసీలో ఇంతకుముందు టికెట్‌ బుక్‌ చేసేటప్పుడు స్టేషన్ల వివరాలు నమోదు చేశాక రైలుపేరు మాత్రమే కనిపించేది. దానిపై క్లిక్‌ చేశాక తరగతిని బట్టి అందుబాటులో ఉన్న టికెట్లు, ధరలు వంటి వివరాలు వచ్చేవి. 
 
ప్రస్తుతం ఆధునీకరించిన వెబ్‌సైట్‌లో ప్రయాణ వివరాలను సెర్చ్‌ చేయగానే రైళ్లు, ఆయా తరగతుల్లో అందుబాటులో ఉన్న సీట్లు, ధరలతోపాటు ఇతర అనేక వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. టికెట్‌ కన్ఫర్మేషన్‌కు ఉన్న అవకాశాలను కూడా అక్కడ శాతాల రూపంలో చూపిస్తుంది. 
 
ఈ ఆప్షన్‌ వల్ల ప్రయాణికులతోపాటు రైల్వేకు సైతం లాభం చేకూరనున్నది. ఏ మార్గంలో ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణం చేయాలనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా మార్గాల్లో కొత్తగా మరో ప్రత్యేక రైలును నడిపేందుకు కూడా వీలవుతుంది.
 
ఇంతకుముందు సీట్లు అందుబాటులో ఉన్నాయనుకొని బుక్‌ చేసేలోపు టికెట్లు అయిపోయాయనే సందేశం వచ్చేది. రైల్వే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టికెట్‌ బుకింగ్‌ అయ్యాక వెయిటింగ్‌ లిస్టు అనే స్టేటస్‌ కనిపించేది. ముఖ్యంగా తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయంలో ఇలా ఎక్కువగా జరిగేది. 
 
తాజాగా ఆధునీకరించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో క్యాచీ సిస్టిమ్‌ను జోడించారు. దీనివల్ల ఎప్పటికప్పుడు ఎన్నిసీట్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. వెబ్‌ పేజీలను రీఫ్రెష్‌, రీలోడ్‌ చేయకుండానే సీట్ల అందుబాటు వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. 
 
రైల్వే టికెట్‌తోపాటే బస చేసేందుకు గదులు, హోటళ్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉన్నది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరిన తర్వాత వాటికోసం ప్రత్యేకంగా వెతుక్కునే శ్రమ తప్పుతుంది. 
 
తరుచూ వెళ్లే రైలు లేదా తరుచూ వెళ్లే మార్గాల్లో సులభంగా టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. వెళ్లాల్సిన రైలుకు సంబంధించిన సమాచారం ఒక్క పేజీలోనే కనిపించేలా చేశారు. సెర్చింగ్‌ విధానాన్ని సులభతరం చేశారు.
 
కొత్త వెర్షన్‌లో సైబర్‌ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. టికెట్‌ బుకింగ్‌ చేసినప్పుడు వినియోగించిన డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలు వినియోగదారుని అనుమతితోనే వెబ్‌సైట్‌లో సేవ్‌ అవుతాయి.