రక్షణ శాఖ కార్యదర్శిగా తెలుగు ఐఏఎస్ అధికారి గిరిధర్ బాధ్యతలు
కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి ఏ.గిరిధర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటివరకు కేంద్ర రవాణాశాఖ కార్యదర్శిగా పని చేసిన ఆయన తాజాగా మరింత కీలక శాఖ అయిన రక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఢిల్లీలోని నేషనల్ వార్ మోమోరియల్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన తర్వాత ఆయన రక్షణ శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిధర్ ఉమ్మడి ఏపీలో పలు కీలక బాధ్యతల్లో పని చేశారు. ఖమ్మం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లుగా పని చేశారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అంతేకాకుండా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా ఆయన విధులు నిర్వహించారు. ఆ తర్వాతి కాలంలో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. కేంద్రంలో తొలుత కేబినెట్ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగా పని చేశారు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ కీలక స్థాయికి చేరుకున్నారు.