సోమవారం, 1 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2025 (14:30 IST)

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

snake
బెంగళూరులోని బన్నెర్ఘట్టలో శనివారం నాడు విషాదం చోటుచేసుకున్నది. 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంజు ప్రకాష్ పాము కాటుతో మరణించాడు. శనివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ప్రకాష్ తన షూస్ ధరించి చెరకు దుకాణం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. తన గది వెలుపల తన షూస్ విప్పేసి వచ్చాడు. షూస్ జత పక్కన చనిపోయిన పామును గమనించిన కుటుంబ సభ్యులు, అది ప్రకాష్ బూట్ల లోపల ఉండి ఉండవచ్చని అనుమానించి ప్రకాష్ గదిలోకి వెళ్లి చూసారు.
 
అప్పటికే అతడి నోటి నుంచి నురగతో పాటు కాలు నుండి రక్తం కారుతూ మంచం మీద పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. కాగా 2016లో బస్సు ప్రమాదానికి గురైన ప్రకాష్ కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని కాలు స్పర్శ కోల్పోయింది. బూట్ల లోపల పాము ఊపిరాడక చనిపోయిందని కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు. మృతుడు టిసిఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.