ప్రాణాలు కాపాడిన శవాలు... ఎలా?
శవాలే ప్రాణాలు కాపాడాయి... ఆగ్రా బస్సు ప్రమాదంలో విషాదకర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని యమూనా ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు ఏ విధంగా తమ ప్రాణాలను దక్కించుకున్నామో చెబుతూ కన్నీటీ పర్యంతమయ్యారు.
రిషీ అనే ఓ వ్యక్తి ఈ ప్రమాదం గురించి చెబుతూ... లక్నో నుంచి ఢిల్లీ వెళ్లేందుకు తాను బస్సు ఎక్కానని.. తెల్లవారుజామున తామంతా గాఢనిద్రలో ఉండగా.. బస్సు కుదుపులకు లోనైందని ఏమైందో తెలుసుకునేలోగా భారీ శబ్దంతో బస్సు నుజ్జనుజ్జయ్యిందని, ఒక్క క్షణం హాహాకారాలు వినిపించాయని ఆ తర్వాత అంతా నిశ్శబ్దం ఏర్పడిందన్నాడు.
చుట్టూ చీకటి ఏం చేయాలో తెలియలేదని రిషీ తెలిపాడు. తన ముందే కొందరి ప్రాణాలు పోయాయని.. ప్రాణాలు రక్షించుకునే క్రమంలో కొందరు ప్రయాణికులు శవాలపైకి ఎక్కి బస్సు నుంచి బయటకొచ్చారని వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన జనరథ్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు.. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.