శ్రీనగర్‌లో హోటల్ యాజమాన్యం ఔదార్యం...
పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్‌ల తర్వాత భారత, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శ్రీనగర్ సహా మరికొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయడం తెలిసిన విషయమే. దీనితోపాటు శ్రీ నగర్-జమ్మూ జాతీయ రహదారిని కూడా మూసివేయడం జరిగింది. దీంతో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. కాగా ఈ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న దేశీయ ప్రయాణికులు, టూరిస్టులను ఆదుకునేందుకు శ్రీనగర్‌లోని ఒక హోటల్ ముందుకు వచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది.
శ్రీనగర్ నగరం నడిబొడ్డున జవహర్ నగర్‌లో ఉన్న హోటల్ ది కైసార్ ఈ విధమైన ఔదార్యాన్ని ప్రదర్శించింది. కాశ్మీర్ లోయను సందర్శించడానికి వచ్చి స్థానిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయిన దేశీయ టూరిస్టులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నట్లు ప్రకటించింది. పరిస్థితి మెరుగుపడేంతవరకు ఈ అవకాశాన్ని అందిస్తామని వెల్లడించిన ఈ హోటల్ యాజమాన్యం శ్రీనగర్‌లో చిక్కుకున్న పర్యాటకులు ఎవరైనా తమ హోటల్ నంబర్లలో సంప్రదించవచ్చని ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.
కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, పర్యాటకులకు ఉచిత వసతి, ఆహారాన్ని అందజేస్తున్నామని హోటల్ ఛైర్మన్ షేక్ బషీర్ అహ్మద్ చెప్పారు. మరోవైపు జమ్ము, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాల్లోని విమాన సర్వీసులను పునరుద్ధరించినట్టు డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.