ఇతడు మిస్సైన మన పైలెట్టేనా? ఫోటోలు షేరింగ్... ప్రభుత్వం ఏం చెపుతుందో?
తమ భూభాగంలో ఓ విమానాన్ని కూల్చేశామనీ, అందులో వున్న ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ బలగాలు చెపుతున్నాయి. కాగా అతడిని అదుపులోకి తీసుకునే ముందు ఆయన్ను చితకబాదారు. కాళ్లతో తన్నారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ అనే పైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ప్రకటించింది. అలాగే, భారత్ కూడా తమకు చెందిన మిగ్ జెట్ ఒకటి కూలిపోయిందని, అందులోని పైలట్ కనిపించడం లేదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్ కమాండర్ అభినందన్ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని సర్వీస్ నంబరు 27981 అని, అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. అతన్ని అదుపులోకి తీసుకునే ముందు ముఖంపై పిడిగుద్దులు కురిపించారు.
మరోవైపు, భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చినట్లు పాకిస్థాన్‌కు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ ఆసీఫ్ గఫూర్ వెల్లడించారు. పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూల్చేయగా.. మరో విమానాన్ని కాశ్మీర్‌లో కూల్చివేసినట్లు తెలిపారు. కాగా ఫోటోల్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి తమవాడేనని భారత్ ఇంకా స్పష్టం చేయలేదు. మరి మిస్ అయిన పైలెట్ ఎవరనేది తేలాల్సి వుంది.