మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (13:43 IST)

సరిహద్దుల్లో ఉద్రిక్తత... పాక్ ఉక్కిరిబిక్కిరి... అసత్య ప్రచారానికి శ్రీకారం

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదేసమయంలో అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా వస్తున్న ఒత్తిడుల కారణంగా పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమకు అండగా నిలుస్తుందని భావించిన చైనాతో పాటు.. అగ్రదేశాలన్నీ పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చాయి. దీనికితోడు దేశీయంగా కూడా పాకిస్థాన్ వైఖరిపై ఆగ్రహజ్వాలలో వ్యక్తమవుతున్నాయి. దీంతో పాకిస్థాన్ అసత్య ప్రచారానికి శ్రీకారం చుట్టింది. 
 
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిరాజ్ యుద్ధ విమానాలతో దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు కూడా భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాదిలోని కొన్ని విమానాశ్ర‌యాల‌ను మూసివేశారు. పంజాబ్‌లో ఉన్న విమానాశ్ర‌యంలో క‌మ‌ర్షియ‌ల్ ఫ్ల‌యిట్ల సేవ‌ల‌ను ఆపేశారు. పాకిస్థాన్ కూడా కొన్ని విమానాశ్ర‌యాల్లో నిషేధ ఆంక్షలను విధించింది. లాహోర్‌, ముల్తాన్‌, ఫైస‌లాబాద్‌, సియాల్‌కోట్‌, ఇస్లామాబాద్ విమానాశ్ర‌యాల‌ను పాక్ మూసివేసింది. 
 
డొమెస్టిక్‌తో పాటు అంత‌ర్జాతీయ విమానసర్వీసులను నిషేధిస్తూ పాక్ ఆదేశాల‌ను జారీచేసింది. భార‌త్‌, పాక్ గ‌గ‌న‌త‌లంలో ప్ర‌యాణించే అన్ని అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై ప్ర‌భావంప‌డింది. ఈ రూట్లో వెళ్లాల్సిన విమానాల‌ను ప్ర‌త్యామ్నాయ ఎయిర్ రూట్లో తీసుకువెళ్తున్నారు. కాశ్మీర్‌లోని జ‌మ్మూ, శ్రీన‌గ‌ర్‌, లేహ్ విమానాశ్ర‌యాల‌ను కూడా మూసివేశారు. అమృత్‌స‌ర్‌, డెహ్రాడూన్ విమానాశ్ర‌యాల్లో కూడా విమాన రాకపోకలపై నిషేధం విధించారు. 
 
ఇదిలావుంటే, దేశీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్థాన్ అసత్య ప్రచారానికి శ్రీకారం చుట్టింది. భారత్‌కు చెందిన రెండు జెట్ విమానాలను కూల్చివేశామని తెలిపింది. ఇందులో ఒక ఫ్లైట్ భారత భూభాగంలోని యురి సెక్టార్‌లనూ, మరొకటి తమ భూభాగంలో పడినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారి ఒకరు ట్వీట్ చేశారు. అంతేకాకుండా, భారత్ పైలట్‌ ఒకరిని తమ అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనిపై భారత ఆర్మీ స్పందించింది. పాకిస్థాన్ చెబుతున్న వార్తల్తో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టం చేసింది.