శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (17:20 IST)

ప్రేమించలేదనే కోపంతో గంజాయి కేసులో ఆమెను ఇరికించాడు.. చివరికి..?

మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. అత్యాచారాలు, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నెన్నో అఘాయిత్యాలు మహిళలపై జరుగుతూనే వున్నాయి. తాజాగా తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రబుద్ధుడు సినిమా రేంజ్‌లో స్కెచ్ వేసి ఆమెను ఇబ్బందుల‌కు గురిచేశాడు. తన ప్రేమను కాదన్న యువతిని ఏకంగా జైల్లోనే పెట్టించాల‌నుకున్నాడు. గంజాయి కేసులో ఇరికించి ఆమెను మాన‌సికంగా ఇబ్బందిపెట్టాడు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. 
 
వివ‌రాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని వళుతకాడ్​లో ‘వీవర్స్​ విలేజ్​’ పేరుతో బిజినెస్ ర‌న్ చేస్తున్నారు శోభా విశ్వనాథ్​. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ఆమెకు తిరువనంతపురంలోని లార్డ్స్​ హాస్పిట‌ల్‌ సీఈఓ హరీశ్​​ హరిదాస్​తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు హరీశ్​. అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి హరీశ్​ను కాస్త దూరం పెట్టింది.
 
దీంతో శోభపై కోపం పెంచుకున్న హరీశ్​.. ఆమెను క‌ట‌క‌టాల‌పాలు చేయాల‌నుకున్నాడు. పక్కా స్కెచ్ వేశాడు. ఆమె దగ్గర పనిచేసే వివేక్​ రాజ్​ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జనవరి 21న, యువతికి చెందిన షాపులో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 
 
మాదక ద్రవ్యాల అక్రమ నిల్వ కేసులో ఆమెను అరెస్ట్​ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఎంత చెప్పినా ఎవ‌రూ విన‌లేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఆమె. ఈ కేసును సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కేసును క్రైమ్​ బ్రాంచ్​కు అప్పగించారు.
 
కేసును దర్యాప్తు చేపట్టిన క్రైమ్​ బ్రాంచ్​.. శోభా విశ్వనాథ్​ను నిర్దోషిగా తేల్చారు. ఆమె షాప్​లో కావాలనే గంజాయి ఉంచి.. కేసులో ఇరికించారని గుర్తించారు. ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను నిజ‌మైన‌వి కావ‌ని పేర్కొన్నారు.