శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (14:45 IST)

మహారాష్ట్రలో ఐదంచెల అన్‌లాక్ ప్లాన్‌ : ఏ విధంగా అమలు చేస్తారంటే...

మహారాష్ట్రను వణికించిన కరోనా వైరస్ ఇపుడు శాంతించింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కరోనా కేసులు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్ర‌భుత్వం కొన్ని ఆంక్షల నుంచి మిన‌హాయింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 18 జిల్లాల్లో థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే నడపాల్సివుంటుంది. 
 
కోవిడ్‌ పాజిటివిటీ రేటు, రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా మహారాష్ట్రలో సోమవారం నుంచి ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియ‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని జిల్లాల్లో కోవిడ్ -19 ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మినహాయింపు పరిమితుల‌ను నిర్ణయించారు. 
 
ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గురువారం క‌రోనా ప‌రిస్థితుల‌ను ప్రజారోగ్య శాఖ స‌మీక్షించ‌నుంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అన్‌లాక్ మొద‌టి స్థాయిలో కనీస పరిమితులు ఉండగా, ఐద‌వ స్థాయిలో అధిక‌ పరిమితులు లేదా లాక్డౌన్‌ను అమలు చేస్తారు. 
 
ఈ ఐదు అంచెల్లో తొలి అంచెలో.. 5 శాతం క‌న్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో, లేదా 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ పడకలు ఉన్న ప్రాంతాల్లో మొద‌టి స్థాయి పరిమితులు విధిస్తారు. 
 
నిత్యావ‌స‌ర వ‌స్తువులు విక్రయించే దుకాణాలు, మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతినిస్తారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకుంటాయి. వివాహాలు, అంత్యక్రియల‌కు అనుమ‌తులుంటాయి. లోక‌ల్ రైళ్లు కూడా నడుస్తాయి.
 
ఇకపోతే, రెండో అంచెలో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువవుండి, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 25 ​​నుంచి 40 శాతం మధ్య ఉన్న ప్రాంతాలను స్థానిక పరిస్థితుల ఆధారంగా రెండో స్థాయిగా గుర్తిస్తారు. ఇక్క‌డ కూడా మొద‌టి స్థాయిలో మాదిరిగానే అనుమ‌తులు ఉంటాయి. అయితే థియేటర్లు, జిమ్‌లు, వివాహాలు, రెస్టారెంట్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతిస్తారు. లోక‌ల్ రైళ్ల సర్వీసుల‌ను పరిమితంగానే న‌డుపుతారు.
 
మూడో అంచెలో.. పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్లు 40 శాతానికి మించి ఉండాలి. ఇటువంటి ప‌రిస్థితిలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తారు. మాల్స్, థియేటర్లు మూసివేస్తారు. 
 
కానీ, రెస్టారెంట్‌ల‌ను 50 శాతం సామర్థ్యంతో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నిర్వహించవచ్చు. బహిరంగ ప్రదేశాలను ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. 
 
50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ కార్యాలయాలను సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతినిస్తారు. వివాహ వేడుకల‌కు 50 మంది మాత్రమే హాజర‌య్యేందుకు అనుమ‌తినిస్తారు. అంత్యక్రియలకు 20 మంది మాత్ర‌మే హాజరు కావాల్సి ఉంటుంది. 
 
నాలుగో స్థాయిలో షాపులు, మాల్స్, థియేటర్లు మూసివేస్తారు. నిత్యావ‌స‌ర దుకాణాలు మాత్రమే సాయంత్రం 4 గంటల వరకు తెరవడానికి అనుమతినిస్తారు. రెస్టారెంట్‌ల‌లో పికప్ లేదా హోమ్ డెలివరీకి అనుమ‌తినిస్తారు. 
 
ప్రభుత్వ కార్యాలయాలు 25 శాతం సిబ్బంది సామర్థ్యంతో న‌డుస్తాయి. వివాహ వేడుకకు 25 మంది మాత్రమే హాజరుకావ‌చ్చు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
 
చివరగా ఐదో అంచెలో... స్థానిక పరిస్థితులను బట్టి లాక్డౌన్ మాదిరిగానే ఉంటుంది. నిత్యావ‌స‌ర‌ దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నారు. మాల్స్, షాపింగ్ సెంటర్లు, జిమ్‌లు తెరిచేందుకు అనుమతి లేదు.