శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (14:01 IST)

మూడు రాష్ట్రాల ఓటమి ఎఫెక్ట్ : దేశ వ్యాప్తంగా రుణమాఫీ

వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళం ఖంగుతింది. మూడు రాష్ట్రాల్లో అధికారం గల్లంతుకాగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లో నామమాత్రపు ప్రభావాన్ని చూపింది. ఈ ఫలితాలతో బెంబేలెత్తిపోయిన కమలనాథులు దిద్దుపాటు చర్యలకు దిగారు. 
 
ఇందులోభాగంగా దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఈ రుణమాఫీ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత కాంగ్రెస్ పాలనలో 2008-09 బడ్జెట్‌లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం రూ.72 వేల కోట్ల విలువైన దేశవ్యాప్త రుణమాఫీని ప్రకటించారు. 
 
2009 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాటి యూపీఏ సర్కారు ప్రకటించిన ఆ సంక్షేమ పథకాన్నే ఇప్పుడు మోడీ సర్కారూ నమ్ముకుంటోందా? నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బతో కుదేలైన ప్రజలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారు. దీంతో అప్రమత్తమై ఈ మార్గాన్ని ఎంచుకుందా? ప్రభుత్వంలోని విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తున్నాయంటూ ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. 
 
ఆ కథనం ప్రకారం.. వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం.. దేశవ్యాప్తంగా అమలయ్యేలా అక్షరాలా 4 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీని ప్రకటించేందుకు మోడీ సర్కారు సిద్ధమైందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, పెట్రోల్, డీజిల్‌లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు మోడీ సర్కారు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.