శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (11:05 IST)

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ఊరట.. కేంద్రానికి చుక్కెదురు

దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసులో కేంద్రానికి చుక్కెదురైంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తక్షణం విధుల్లోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సీబీఐ డైరెక్టరు అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్‌ రాకేష్ ఆస్థానాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరులో భాగంగా సీబీఐ డైరెక్టరుగా ఉన్న అలోక్ వర్మను కేంద్రం అక్టోబరు 23వ తేదీన నిర్బంధ సెలవుపై పంపించింది. దీన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను నిర్బంధ సెలవుపై పంపడం చట్టవిరుద్ధమని అందులో పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కేంద్రానికి షాక్ ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌ను సెలవుపై పంపడం కుదరదన్నారు. సీబీఐ డైరెక్టరు అధికారాలను లాగేసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని స్పష్టంచేసింది. పైగా, అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టివేస్తూ, తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసులో 76 రోజుల తర్వాత సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.