రాఫెల్‌లో అనుమానాలు అక్కర్లేదు.. సుప్రీంకోర్టు :: బీజేపీకి బిగ్ రిలీఫ్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో విపక్ష పార్టీలకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పైగా, దేశ భద్రత దృష్ట్యా ఈ యుద్ధ విమానాల ధర బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అదేసమయంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందంటూ దాఖలైన సుమారు 20 పిటీషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ కొట్టిపారేశారు.
ఈ స్కీమ్‌లో ఒక్కో యుద్ధ విమానం ధర రూ.526 కోట్ల నుంచి ఒక్కసారిగా రూ.1600 కోట్లకు పెంచారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిన్నింటిపై ప్రధాన న్యాయమార్తి రంజన్ గొగోయ్ శుక్రవారం తీర్పును వెలువరించారు. కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలను ఎందుకు దాస్తోందని పిటిషనర్ లేవనెత్తిన సందేహాలను సుప్రీం తోసిపుచ్చింది. ఆ డీల్‌పై ఎలాంటి దర్యాప్తులు, విచారణలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.
రాఫెల్ డీల్ వివరాలను రహస్యంగా ఉంచడం వల్ల నష్టం లేదని, దేశ భద్రత దృష్ట్యా ఆ వివరాలను రహస్యంగా ఉంచొచ్చని అభిప్రాయపడింది. రాఫెల్ డీల్‌ను రహస్యంగా ఉంచడం వెనుక సందేహాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ఒప్పందంపై విచారణ జరపాలని కొందరు కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, మరో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం గతంలో విచారణ జరిపి పైవిధంగా తీర్పునిచ్చింది.
ఈ తీర్పు భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పెద్ద ఊరటలాంటింది. ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను చేజారిపోగా, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతంగా మారాయి. ఈ నేపథ్యంలో రాఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి బిగ్ రిలీఫ్ వంటింది.