శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (19:11 IST)

తమిళనాడులో కరోనా కలకలం.. 29మంది పోలీసులకు కరోనా.. ఎస్ఐ మృతి (video)

తమిళనాడులో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. చెన్నై, చెంగల్పట్టు, తిరవళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై ఐస్‌హౌస్‌, అయినావరం ప్రాంతాల్లో పనిచేస్తున్న 29 మంది పోలీసులకు కరోనా సోకింది. రెండు రోజులకు ముందు వీరంతా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో 600మంది పోలీసులకు కరోనా పరీక్షలు చేయించినట్లు తెలిసింది.
 
ఆ పరీక్షలలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో నగరంలోని నాలుగు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. ఐస్‌హౌస్‌ ప్రాంతంలో వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న, పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న 15 మంది పోలీసులకు కరోనా సోకింది. వీరిని కూడా చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
 
ఇదేవిధంగా మాంబళం పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ బాలమురళి కరోనా వైరస్‌‌ కారణంగా మృతి చెందారు. జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరిన బాలమురళి.. రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 
 
కరోనా పాజిటివ్ అని తేలడంతో.. 13న ఆయన ఆరోగ్యపరిస్థితి బాగా క్షీణించింది. వైద్యుల సలహా మేరకు నగర పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ రూ.2.25 లక్షల విలువచేసే మందులను తన స్వంత ఖర్చులతో తెప్పించి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్‌ఐ బాలమురళి మృతి చెందారు.