థ్యాంక్యూ ఇండియా : ఫ్రెంచ్ ఫ్యామిలీ కృతజ్ఞతలు... ఎందుకు?
ముంబై వరదల్లో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిక్కుకుని అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వరద బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ముంబై వరదల్లో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిక్కుకుని అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వరద బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ వరదల్లో చిక్కున్న వారిలో కేవలం ముంబై వాసులే కాకుండా, ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ఓ ఫ్రెంచ్ కుటుంబం కూడా ఉంది. ఈ కుటుంబానికి ముంబైలోని ఓ గురుద్వారా ఆశ్రయం కల్పించింది.
నివాస ప్రాంతాలేకాకుండా, హోటళ్లు మునిగిపోయి, ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో గురుద్వారా తమకు లైట్‌హౌస్‌లా కనిపించిందని, తమను ఆదుకుందంటూ ఆ కుటుంబం గురుద్వారాకు లేఖ రాసింది. వారు తమకు ఇచ్చింది ఆశ్రయం మాత్రమే కాదని, గొప్ప అనుభూతిని అంటూ ఆ కుటుంబం కొనియాడింది. 'థ్యాంక్యూ ఇండియా' అంటూ కృతజ్ఞతలు తెలిపింది.
ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఆరీ, సోఫీ బోలెస్వస్కి వారి ముగ్గురు కుమార్తెలు ముంబై వరదల్లో చిక్కుకుపోయారు. తలదాచుకునేందుకు మూడు హోటళ్లకు వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు గురుద్వారాకు చేరుకున్నారు. అక్కడ వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఆ కుటుంబానికి భోజనం పెట్టిన నిర్వాహకులు వారి కోసం ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు.
వరదలు నెమ్మదించిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు పారిస్ చేరుకున్నారు. అనంతరం గురుద్వారాకు లేఖ రాశారు. బుధవారం ఉదయం లేఖ అందింది. అందులో గురుద్వార నిర్వహకులకు ఆరీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఎప్పుడైనా పారిస్ వస్తే తప్పకుండా తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు.