1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:24 IST)

కేరళలో తొలి జికా వైరస్‌ కేసు

కేరళలో తొలిసారిగా జికా వైరస్‌ కేసు వెలుగు చూసింది. 24 ఏళ్ల మహిళలో ఈ వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు. తిరువనంతపురంలో మరో 13 అనుమానిత కేసులు ఉన్నాయని, వాటికి సంబంధించి పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్‌ఐవీ) నుంచి ధ్రువీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

‘‘తిరువనంతపురం నుంచి 19 నమూనాలు ల్యాబ్‌కు వెళ్లాయి. వారిలో వైద్యులు సహా 13 మంది ఆరోగ్య కార్యకర్తలకు జికా వైరస్‌ సోకి ఉంటుందని అనుమానిస్తున్నాం’’ అని చెప్పారు. ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మహిళ గురువారం ఒక బిడ్డకు జన్మనిచ్చిందన్నారు.

ఆమె ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలతో ఆమె జూన్‌ 28న ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. రాష్ట్రం వెలుపలికి ఆమె ప్రయాణించలేదు. ఆమె ఇల్లు తమిళనాడు సరిహద్దుల్లో ఉంది.

వారం కిందట ఆమె తల్లిలోనూ ఇవే లక్షణాలు కనిపించాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జికా వ్యాధి లక్షణాలు కూడా డెంగీ తరహాలోనే ఉంటాయి. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.