ట్రాక్టర్ నడుపుతూ టిక్ టాక్ కోసం కొత్త పెళ్లి కొడుకు స్టంట్ ఫీట్, చక్రాల కింద పడ్డాడు
టిక్ టాక్ పిచ్చి చాలామందిని బలిగొంటోంది. ఆ పిచ్చిలో పడిని వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తనకు పెళ్లయిందన్న ఆనందంలో కొత్త పెళ్లి కొడుకు చేసిన ఫీట్ అతడి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ముజఫర్ నగర్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో కొత్తగా పెళ్లయిన 23 ఏళ్ల వ్యక్తి టిక్ టాక్ ద్వారా తను చేసే ఫీట్‌ను వీడియో తీయాలనుకున్నాడు.
ఈ క్రమంలో వేగంగా వెళుతున్న ట్రాక్టర్‌పైకి ఎక్కి స్టీరింగ్ పట్టుకుని ఫీట్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్టీరింగ్ కంట్రోల్ తప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ సమయంలో అతడు ఎగిరి ట్రాక్టర్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకురాకుండానే మృతుడి అంత్యక్రియలు ముగించారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.