మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:21 IST)

ఇంటిలో అద్దెకు ఉండే వారు ఇంటి యజమానులు కాలేరు: సుప్రీంకోర్టు

యజమానుల ఇళ్లల్లో అద్దెకుంటున్న రెంటర్స్‌ గురించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి అద్దె కట్టకుండా.. ఖాళీ చేయడానికి ఇష్టపడని అద్దెదారులకు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. మీడియా నివేదిక ప్రకారం.. యజమానికి మాత్రమే తన సొంత ఇంటిపై సర్వ హక్కులు ఉంటాయని, అద్దెదారుల జులుం చెల్లదని పేర్కొంది.

భూస్వామియే నిజమైన యజమాని అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అద్దెదారులు ఇంట్లో ఎంతకాలం నివసించి ఉన్నా.. సమయానికి అద్దె కట్టినా.. వారు కేవలం అద్దెదారులుగానే పరిగణిస్తారన్నారు.
 
మధ్యప్రదేశ్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి దాదాపు మూడేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అద్దె ఇవ్వమని యజమాని అడిగినప్పుడు డబ్బులు చెల్లించని.. ఇంటిని ఖాళీ చేయమని చెప్పినప్పుడు కూడా ఖాళీ చేయనని చెప్పుకొచ్చాడు. దీంతో యజమాని కోర్టును ఆశ్రయించాడు.

ఈ ఘటన గతేడాది జనవరిలో చోటు చేసుకుంది. ఈ మేరకు అప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా అద్దె దారుడికి రూ.9 లక్షలు చెల్లించడానికి నాలుగు నెలల సమయం కూడా ఇచ్చింది. ఇళ్లును ఖాళీ చేసి.. బాకీ అద్దె మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

యజమానికి పిటిషన్ వేసిన రోజు నుంచి ఇంటిని ఖాళీ చేసే వరకు నెలకు రూ.35వేలు చెల్లించాలని ఆదేశించింది. అయినా దినేశ్ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాడు. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు ఆశ్రయించగా.. అత్యన్నత న్యాయస్థానం అద్దెదారు పిటిషన్‌ను కొట్టివేసింది. వెంటనే ఇళ్లు ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసింది.
 
జస్టిస్ రోహింగ్టన్ ఎఫ్.నరిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో ధర్మాసనం విచారణ జరిగింది. వాదోపవాదాలు విన్న తర్వాత అద్దెదారుడు దినేశ్‌కు ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వీలైనంత వరకు ఇళ్లును ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మూడేళ్లుగా కట్టని అద్దెతోపాటు అదనంగా కట్టాల్సిన డబ్బులను తొందరగా చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు అద్దెదారుడు తరఫు న్యాయవాది దుష్యంత్ పరాషర్ మాట్లాడుతూ.. ఇంటి అద్దె జమ చేయడానికి సమయం ఇవ్వమన్నారు.

కానీ, సుప్రీంకోర్టు బకాయిలు క్లియర్ చేయడానికి అద్దెదారుడికి ఇది వరకే చాలా ఎక్కువ సమయం కేటాయించడం జరిగిందని, ఇంకా సమయం ఇవ్వడం కుదరదని తెలిపింది.

యజమాని ఇంట్లోనే ఉంటూ.. అద్దె చెల్లించకుండా.. యజమానిని వేధించడం కరెక్ట్ కాదని, దీనికి కోర్టు ఉపశమనం ఇవ్వడం జరగదన్నారు. వీలైనంత వరకు డబ్బులు చెల్లించి.. అద్దె ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది.