బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (12:16 IST)

దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలి: జ‌గ‌న్‌

దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలి అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అన్నారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఎంత‌గానో ఉపయోగపడుతుందని, దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాల‌ని పేర్కొన్నారు. భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం ఉంద‌న్నారు. క్యూ–ఆర్‌ కోడ్‌ ద్వారా ఇ– హుండీకి కానుకలు సమర్పించ వ‌చ్చ‌న్నారు. 
 
పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన సముద్ర జలాలను అందించాల‌ని పేర్కొన్నారు. డీశాలినేషన్‌ ప్లాంట్లను ప్రమోట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. అలాగే రీసైకిల్‌ చేసిన నీటిని కూడా పరిశ్రమలకు ఇవ్వాలి. రిజర్వాయర్లు, కాల్వల్లోని ఉపరితల జలాలను పూర్తిగా ఆదా చేసుకోవాలి.

పరిశ్రమలకు అందుబాటులో నీటిని ఉంచాల్సిన బాధ్యత ఏపీఐఐసీది. పరిశ్రమలకు అవసరమైన క్వాలిటీ నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ప‌కడ్బందీగా డీశాలినేషన్‌ చేసి.. నాణ్యమైన నీటిని పరిశ్రమలకు, పారిశ్రామిక వాడలకు అందించాలి. సముద్ర తీర ప్రాంతాల్లో డీశాలినేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. పైపులైన్‌ ద్వారా ఈ నీటిని తరలించి. ప‌రిశ్రమలకు అందించేలా ఆలోచనలు చేయాలి. ఈ వ్యవహారాల సమన్వయ బాధ్యత ఏపీఐఐసీ చేపట్టాలి.

సాగుకోసం వినియోగించే నీటిని పరిశ్రమలు వినియోగించుకోకుండా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏరకంగా నీటిని పరిశ్రమలకు అందించవచ్చో కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలి.

ఎక్కడెక్కడ పరిశ్రమలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ప్రస్తుతం నీటిని వాడుతున్నారు, ఆ నీటికి బదులుగా డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఏ రకంగా ఇవ్వగలుగుతాం? అన్న అంశాలపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ప్రణాళిక సిద్ధంచేయాలి అని సీఎం జ‌గ‌న్ స్పష్టం చేశారు.