శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (14:28 IST)

తమిళనాడులో అర్థరాత్రి తీరందాటనున్న బురేవి.. రెండు రాష్ట్రాలకు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన బురేవిa తుఫాను శ్రీలంక తీరం దాటి తమిళనాడు తీరం దిశగా పయనిస్తోంది. గురువారం అర్థరాత్రి తర్వాత పంబన్, కన్యాకుమారి మధ్య బురేవి తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 
 
తుఫాను తీరం దాటే సమయంలో 80 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. దీని ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. 
 
కాగా, తమిళనాడుతో పాటు కేరళలోని 7 జిల్లాలపై 'బురేవి' ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన బులిటెన్‌లో పేర్కొంది. 
 
కాగా, తాజా వాతావరణ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. 'బురేవి' దూసుకొస్తున్న నేపథ్యంలో కేంద్రం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు.
 
అటు, తుఫాను నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం నుంచి తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దక్షిణ తమిళనాడులోని రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాల్లో ఒక మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.