1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (18:15 IST)

చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి

చిప్స్, బిస్కెట్స్ తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలిలో చోటుచేసుకుంది. బరేలీ ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ సింగ్ కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పారి, పిహు, విధి కాగా ఈ ముగ్గురు చిన్నారులు చాలా చురుగ్గా ఉండేవారు. 
 
అయితే గత శుక్రవారం ముగ్గురు స్థానికంగా ఉన్న ఓ షాపులో బిస్కెట్స్, చిప్స్ కొనుక్కుని వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి వాటిని తిన్నారు. అవి తిన్న తర్వాత 24 గంటల్లోపే ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
కడుపు నొప్పి వాంతులతో బాధ పడ్డారు. దాంతో తండ్రి నవీన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం తీసుకెళ్తుండగా ఇద్దరు అక్కా చెల్లెలు పీహు, పారి మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఇక విధి చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు తెలుస్తోంది.
 
ఆదివారం నాడు చిన్నారుల అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చిన్నారులు తిన్న చిప్స్ బిస్కెట్లను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.